ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన కుటుంబంలోని ఒక ప్రధాన సభ్యుడిని బీమా లబ్ధిదారుడిగా నమోదు చేస్తామని, బీమా పొందిన వ్యక్తి మరణిస్తే వారి నామినీకి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని వివరించారు. అర్హులైన కుటుంబాలకు దరఖాస్తు ఫారాలను గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పథకాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

You may also like...