బాలల హక్కులు, విధులు, బాధ్యతలపై అవగాహన

జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని సి హాస్టల్‌లో బాలల హక్కులు, విధులు, బాధ్యతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ మంచాల రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే చదువుపై శ్రద్ధ చూపి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య, వైద్యం, న్యాయ సేవల గురించి వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో విద్యార్థులు చైతన్యవంతులుగా ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు. సమాజంలో ప్రతి బాలుడు తనకు లభించాల్సిన హక్కులను పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు పి. జితేందర్, బి. శేఖర్, సి హాస్టల్ వార్డెన్ దేవేందర్, ఎస్టీ హాస్టల్ వార్డెన్ జూమ్‌లాల్, విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...