కులవివక్షకు తావులేకుండా అందరికీ ఆలయ ప్రవేశ హక్కు కల్పించాలి
- కులవివక్షకు తావులేకుండా అందరికీ ఆలయ ప్రవేశ హక్కు కల్పించాలి - November 12, 2026
- నాబార్డ్ నిధులతో బ్రాహ్మణపల్లి పాఠశాల అభివృద్ధికి బాటలు.. ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం - November 12, 2026
- మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ కుటుంబానికి సంపత్ గౌడ్ పరామర్శ - November 11, 2026
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో జాతీయ దేవాలయ ప్రవేశ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కులాలకు చెందిన ప్రజలు ఐక్యంగా దేవాలయంలోకి ప్రవేశించి శివునికి అభిషేకం నిర్వహించారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సామాజిక సమరసత వేదిక కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు తుమ్మ రామచంద్రం మాట్లాడుతూ.. 1936 నవంబర్ 12న ట్రావెన్కోర్ సంస్థాన మహారాజు శ్రీ చితిర తిరునాళ్ బలరామ వర్మ దేవాలయ ప్రవేశ ప్రకటన జారీ చేసి, కులభేదాలు లేకుండా హిందూ దేవాలయాల్లో అందరికీ ప్రవేశ హక్కు కల్పించారని గుర్తుచేశారు. సాధుసంతులు, భక్తులు, సంఘ సంస్కర్తల పోరాటాలు, ప్రజా ఉద్యమాల ఫలితంగానే ఈ హక్కు సాధ్యమైందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కు కల్పించిందని, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించిందని తెలిపారు. నేటికీ కొన్ని ప్రాంతాల్లో కులం పేరుతో దళితులకు దేవాలయ ప్రవేశం నిరాకరించడం బాధాకరమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, మానవత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. దేవాలయం భగవంతుడిని ఆరాధించే పవిత్ర స్థలమని, అక్కడ కులవివక్షకు తావులేదని స్పష్టం చేశారు. నందనార్, కనకదాసు, బసవేశ్వరుల జీవితాలను ప్రస్తావిస్తూ భక్తికి కులభేదాలు అడ్డుకావని, భగవంతుని ముందు అందరూ సమానమేనని వివరించారు. ప్రతి గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 12 మంది దళిత సోదరులు, ఐదుగురు దళిత సోదరీమణులతో పాటు వివిధ కులాలకు చెందిన సుమారు 70 మంది పాల్గొని సామూహికంగా శివునికి అభిషేకం చేయడం విశేషం. ఈ కార్యక్రమం సామాజిక ఐక్యత, సమానత్వానికి ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమలత రామరాజు, ఉపసర్పంచ్ గడీల రాజశేఖర్, సామాజిక సమరసత వేదిక ఇందూర్ విభాగ్ సంయోజక్ సంగన్నగారి బాల్ రాజ్ గౌడ్, ఉపాధ్యక్షులు బిక్కనూరి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి భూంపల్లి భూపాల్, సోషల్ మీడియా కన్వీనర్ భాస్కర్ రావు, బస్తీ ప్రముఖ్ సంగి రాజేందర్, కళా విభాగం కన్వీనర్ భాను ప్రసాద్, గ్రామస్థులు సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

