పోతేపల్లిలో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.!
- పోతేపల్లిలో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.! - November 13, 2026
- డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం – సీఐ జానకి రాంరెడ్డి.! - November 12, 2026
- నాగర్కర్నూల్ జిల్లాలో ఉద్యోగ అవకాశం.. రోడ్డు భద్రతా సమన్వయకర్త పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.! - November 12, 2026

వెల్దండ,నవంబర్ 13:నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో గురువారం రాత్రి యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుకల్లో యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.ప్రత్యేక తలపాగాలు ధరించి సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో యువకులు, పెద్దలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతును గ్రామ వీధుల్లో ఊరేగించడంతో పండుగ వాతావరణం నెలకొంది. డప్పు చప్పుళ్లు,యువత కేరింతలతో గ్రామమంతా సందడిగా మారింది.ఈ సందర్భంగా సర్పంచ్ కొండలు యాదవ్ మాట్లాడుతూ.. సదర్ ఉత్సవాలు యాదవుల సంస్కృతి,సంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ వేడుకలు యాదవుల వీరత్వం, ధైర్యసాహసాలు, పశుపోషణతో ముడిపడిన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. ముఖ్యంగా సదర్ పండుగ ద్వారా యాదవ సోదరులంతా ఒకచోట చేరి తమ సంప్రదాయాలను గుర్తు చేసుకోవడంతో పాటు భావితరాలకు వాటి విశిష్టతను తెలియజేసే అవకాశం కలుగుతుందని అన్నారు. ఇలాంటి పండుగలను ఐకమత్యంతో నిర్వహిస్తూ మన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండలు యాదవ్, ఉప సర్పంచ్ శారద బాలయ్య గౌడ్, నాయకులు అంజి మాస్టర్, యాదగిరి, కొండల్, బాలు, రాజశేఖర్, శివ యాదవ్ తదితరులతో పాటు గ్రామస్తులు, యాదవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
