తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) 2026 నవంబర్ 12న జీఓ ఆర్‌టీ నంబర్ 1654ను విడుదల చేసింది. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ కీలక బాధ్యతలు అప్పగించింది.ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ కాగా, ఆయన స్థానంలో మహేష్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. వీసీ సజ్జనార్‌కు తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా బాధ్యతలు అప్పగించారు.

డాక్టర్ సౌమ్య మిశ్రాను మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా నియమించడంతో పాటు పోలీస్ ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు అప్పగించారు. స్వాతి లక్రాను జైళ్లు, దిద్దుబాటు సేవల డీజీగా నియమించారు.చారు సిన్హాకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ బాధ్యతలు అప్పగించారు. అనిల్ కుమార్‌ను టీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. విక్రమ్ సింగ్ మాన్‌కు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల బాధ్యతలు ఇచ్చారు.
వై. నాగిరెడ్డికి సివిల్ సప్లయ్స్ కమిషనర్‌గా, ఎం. స్టీఫెన్ రవీంద్రకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విభాగంలో బాధ్యతలు అప్పగించారు. పోలీస్ శాఖలో పరిపాలన, శాంతిభద్రతలు, భద్రతా వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల ద్వారా వెల్లడైంది.

You may also like...