ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్
- డిండి ఎత్తిపోతల పథకం అంశంపై సమీక్ష సమావేశం - August 27, 2026
- సురేఖపై అధిష్ఠానం కొరడా! - August 27, 2026
- ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్ - August 27, 2026

తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నగరంలో కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్–2026కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించడం విశేషం.
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లపై పడుతున్న ఇంధన వ్యయ భారాన్ని తగ్గించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా రెట్రోఫిట్‌మెంట్ చేసుకునే వారికి, అలాగే కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసే వారికి రూ.1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. దీంతో డ్రైవర్లకు నిర్వహణ, ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా ప్రయోజనం కలగనుంది.
ఇటీవల ఆటో కార్మిక సంఘాల జేఏసీ సమ్మె విరమణ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనల మేరకు ప్రభుత్వం ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంపై దృష్టి సారించింది. ఆటో ఛార్జీల సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, అవసరమైన జీవో జారీ చేయనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అదేవిధంగా ప్రైవేట్ యాప్‌లపై ఆటో డ్రైవర్ల ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఓలా, ఉబర్ తరహాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్‌ను రూపొందించే అంశంపైనా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఐటీ శాఖతో కలిసి పనిచేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయాలు అమలులోకి వస్తే ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా ఉపశమనం కలగడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది
