ఇరాన్ కీలక టర్న్!
- ఇరాన్ కీలక టర్న్! - August 22, 2026
- హరీశ్‌రావుకు గౌడి చర్ల వారి వివాహ ఆహ్వానం - August 22, 2026
- గచ్చిబౌలి స్టేడియంలో యువ శౌర్య సేనకు హై రేంజ్ వరల్డ్ రికార్డు సాధించిన సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి
- August 22, 2026

జ్ఞాన తెలంగాణ,స్టేట్ :
అమెరికాతో నెలల తరబడి కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బలమైన, గౌరవప్రదమైన స్థితిలో ఉన్నప్పుడే యుద్ధానికి ముగింపు పలకడం దేశ ప్రయోజనాలకు మేలని స్పష్టం చేశారు. శుక్రవారం వైద్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధాన్ని అంతులేని ఘర్షణగా కొనసాగించడం కంటే, ఇరాన్ తన శక్తిని, గౌరవాన్ని కాపాడుకుంటూనే పరిష్కార మార్గాన్ని అన్వేషించడం అవసరమని సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ విదేశాంగ విధానంలో కీలకమైన మార్పుకు సంకేతమా? లేక శత్రు దేశాలపై ఒత్తిడి కొనసాగిస్తూనే చర్చలకు సిద్ధమనే వ్యూహాత్మక ప్రకటననా? అన్న చర్చ అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
పెజెష్కియాన్ తన వ్యాఖ్యల్లో అమెరికాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ అమెరికా పాఠశాలలు, ఆసుపత్రులపై దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా అమెరికాపై వ్యతిరేకత, ద్వేషం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పోరాటంలో ఇరాన్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, ప్రపంచం తమ విజయాన్ని గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా బెదిరింపులకు ఇరాన్ తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూనే, అవసరమైతే తమ దేశాన్ని రక్షించుకునేందుకు గట్టిగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ఈ ఏడాది ఆరంభంలో అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ప్రారంభమైన సంఘర్షణ అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ప్రత్యక్ష సైనిక ఘర్షణలతో పాటు ఆర్థిక ఆంక్షలు, సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి చుట్టూ భద్రతా ఆందోళనలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు వాషింగ్టన్ కొత్త ఆంక్షలకు సిద్ధమవుతుండగా, టెహ్రాన్ మాత్రం తమపై ఎలాంటి బలవంతపు షరతులను అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చిచెబుతోంది. దీంతో ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు మార్గం మరింత క్లిష్టంగా మారింది.
జూన్‌లో అమెరికాతో కుదిరిన అవగాహనలో ఇరాన్ లొంగిపోయినట్లు ఎలాంటి నిబంధనలు లేవని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ గౌరవాన్ని దెబ్బతీసే షరతులను అంగీకరించబోమని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు యుద్ధాన్ని మరింత కాలం కొనసాగించడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం, ప్రజలపై భారాలు అధికం కావడం, అంతర్జాతీయంగా ఒంటరితనం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఇరాన్‌ను ఆలోచనలో పడేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే బలహీన స్థితి నుంచి కాకుండా, తమకు అనుకూలమైన స్థితి నుంచే చర్చలకు సిద్ధమనే సంకేతాలను టెహ్రాన్ పంపుతున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఒమన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ప్రత్యక్షంగా చర్చలు జరపడానికి ఇరుదేశాలు వెనుకంజ వేస్తున్న పరిస్థితిలో, ఒమన్ దౌత్య మార్గాల ద్వారా ఇరువర్గాల మధ్య సందేశాలను చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శాంతి చర్చలు ఫలించాలంటే ఇరాన్‌పై ఒత్తిడి, ఆంక్షలు తగ్గించడంతో పాటు ఇరాన్ నుంచి కూడా కొన్ని కీలక హామీలు అవసరమవుతాయని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో పెజెష్కియాన్ తాజా వ్యాఖ్యలు చర్చలకు తలుపులు పూర్తిగా మూసివేయలేదనే సంకేతాన్ని ఇస్తున్నాయి. అయితే ఇరాన్ తనను తాను విజేతగా, బలమైన దేశంగా చూపించుకుంటూనే చర్చల బల్లపైకి రావాలని చూస్తుండటం ఈ దౌత్య ప్రక్రియను అత్యంత సున్నితమైన దశలోకి నెట్టింది.
