ట్రంప్ టారిఫ్‌లకు అమెరికాలోనే చట్టపరమైన సవాల్.. 25 రాష్ట్రాల దావా

వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) ఇప్పుడు న్యాయపరమైన వివాదానికి దారితీశాయి. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాల కూటమి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో దావా దాఖలు చేసింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వినియోగదారులు, చిన్న వ్యాపారాలు, దిగుమతులపై ఆధారపడే పరిశ్రమలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటాయని రాష్ట్రాలు వాదిస్తున్నాయి.

గత నెలలో ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అమెరికా దిగుమతుల్లో 99.4 శాతం వాటా కలిగిన 60 దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలు విధించింది. బలవంతపు కార్మిక వ్యవస్థ (ఫోర్స్డ్ లేబర్)ను అరికట్టడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత భారత్‌పై 12.5 శాతం టారిఫ్ ప్రతిపాదించినప్పటికీ, తర్వాత దానిని 10 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం భారత్‌తో పాటు మరో 16 దేశాలు 10 శాతం టారిఫ్ పరిధిలో ఉన్నాయి.

ఈ టారిఫ్‌లను సవాల్ చేస్తూ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్, గవర్నర్ క్యాథీ హోచుల్ నేతృత్వంలోని రాష్ట్రాల కూటమి సోమవారం కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధమైన అధికారాలను దాటి సుంకాలు విధించిందని, దీంతో అమెరికా ప్రజలపై అదనపు పన్ను భారం పడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

లెటిషియా జేమ్స్ మాట్లాడుతూ, “సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తిన్న తర్వాత ట్రంప్ ప్రభుత్వం మరోసారి కొత్త టారిఫ్‌ల పేరుతో కుటుంబాలు, వ్యాపారాలపై అక్రమంగా ఆర్థిక భారం మోపేందుకు ప్రయత్నిస్తోంది” అని విమర్శించారు. ప్రభుత్వం ‘ట్రేడ్ యాక్ట్–1974’లోని సెక్షన్ 301 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నామని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఇది చట్టాన్ని దుర్వినియోగం చేసి పన్నులు పెంచడమేనని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.

కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. “టారిఫ్‌లు అంటే ప్రజలపై విధించే పన్నులే. అధ్యక్షుడి విఫలమైన, చట్టవిరుద్ధమైన ఆర్థిక విధానాల ఖర్చును అమెరికా ప్రజలు భరించలేరు” అని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం మూడు బలవంతపు కార్మిక ఉత్పత్తులను సాకుగా చూపి, డజన్ల కొద్దీ దేశాలపై విస్తృతంగా సుంకాలు విధించడం ఏకపక్ష చర్య అని దావాలో పేర్కొన్నారు.

ఈ సుంకాల వల్ల దిగుమతి వస్తువుల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం మరింత అధికమయ్యే అవకాశం ఉందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, తయారీ రంగం, రిటైల్ సంస్థలు తీవ్ర ప్రభావానికి గురవుతాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్‌లను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించి, వెంటనే అమలు నుంచి ఉపసంహరించాలని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టును రాష్ట్రాల కూటమి కోరింది. ఈ కేసు తీర్పు అమెరికా వాణిజ్య విధానాలపై మాత్రమే కాకుండా, భారత్ సహా పలు దేశాలతో భవిష్యత్ వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశముంది.

You may also like...