వెల్దండలో వరుస చోరీలు.. మూడు ఇళ్లలో దొంగల చేతివాటం!

1001366283.jpg

వెల్దండ, నవంబర్ 16:వెల్దండ మండల కేంద్రంలో గుర్తుతెలియని దొంగలు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలెస్కాన్‌పేటకు చెందిన అలివేలు ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లగా, దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.1,500 నగదును అపహరించారు. అనంతరం బీరువాను ఇంటి నుంచి కొంతదూరం ఎత్తుకెళ్లి వదిలేశారు. అలాగే దార రాములు ఇంట్లో ఉన్న రూ.9 వేల నగదును దొంగిలించారు. ఆయన ఇంటికి తాళం వేసి తాండ్ర గ్రామానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది.మరో ఘటనలో గడ్డం వెంకటయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దొంగలు ప్రవేశించి మొబైల్ ఫోన్‌ను అపహరించారు. ఇంట్లో అలికిడి గమనించిన వెంకటయ్య గట్టిగా కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం లేచి చూడగా మొబైల్ ఫోన్ కనిపించలేదని బాధితుడు తెలిపాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా, క్లూస్ టీమ్ బృందం చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఈ ఘటనపై ఎస్సై యుగంధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

You may also like...