ప్రజా భద్రతకు సీసీ కెమెరాలే నేటి నిఘా కవచం యువత సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి – ఎస్సై వెంకటరావు

నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 10: ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని నస్రుల్లాబాద్ మండల ఎస్సై వెంకటరావు అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సెటి) కామారెడ్డిలో సీసీటీవీ కెమెరా ట్రైనింగ్ రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై వెంకటరావు దీపప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత, ప్రజల రక్షణలో యువత పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, ప్రజలకు భద్రత కల్పించడంలో సీసీటీవీ కెమెరాలు కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఆర్‌సెటి అందిస్తున్న ఉచిత శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు.

ఆర్‌సెటి సంస్థ డైరెక్టర్ అమర్‌సింగ్ మాట్లాడుతూ శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యాలను సంస్థ కల్పిస్తుందని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో డీఎస్‌టీ సురేష్, అధ్యాపకులు జీవన్ నాయక్, సూర్యతేజ, సంస్థ ప్రతినిధులు సార్థిక, శ్రీకాంత్, పోలీసు సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.

You may also like...