బీసీ గురుకులాల కార్యదర్శి సైదులుపై అసత్య ప్రచారాలను మానుకోవాలి: కుమారస్వామి పరికి

హైదరాబాద్: బీసీ గురుకులాల కార్యదర్శి సైదులుపై కొందరు విద్యార్థి నాయకుల పేరుతో నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయడం బాధ్యతారాహిత్యమని, వాటిని వెంటనే నిలిపివేయాలని జై భీమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుమారస్వామి పరికి డిమాండ్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మార్చి 2024లో కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సైదులు బీసీ గురుకులాల అభివృద్ధి, నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, భద్రత కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు.
గురుకులాల్లో ప్రవేశాలకు భారీ డిమాండ్ ఉండటంతో కొందరు మధ్యవర్తులు, దళారులు అమాయక తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి సైదులు కఠిన చర్యలు చేపట్టారని వివరించారు. దీంతో అక్రమ మార్గాలకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారాలతో అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రతిరోజూ ఉదయం కార్యాలయంలో అందుబాటులో ఉంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను స్వయంగా విని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని కుమారస్వామి పరికి తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలు నిర్వహించడం సమాజానికి మేలు చేయదన్నారు. బీసీ గురుకులాల అభివృద్ధికి ఆటంకం కలిగించే అసత్య ప్రచారాలను విరమించి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నిర్మాణాత్మకంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

You may also like...