ఆధునిక యుద్ధాలకు సిద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్
- రైతులకు ఏఐ వ్యవసాయ సేవలు - November 12, 2026
- టీ20 లీగ్‌లపై ఐసీసీ కొరడా! - November 12, 2026
- మోదీపై సామ్ పిట్రోడా ప్రశంసలు - November 12, 2026

న్యూఢిల్లీ:
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైనిక దళాలకు పిలుపునిచ్చారు. శత్రువుల నుంచి ఆకస్మిక దాడులు జరిగే అవకాశాలను ముందుగానే పసిగట్టి, తగిన ప్రతిస్పందన ఇచ్చే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఢిల్లీలో నిర్వహించిన వైమానిక దళ కమాండర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా రక్షణ, ప్రతిదాడి వ్యూహాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిఘా, పర్యవేక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని, శత్రువుల కదలికలను ముందుగానే గుర్తించి అప్రమత్తమయ్యేలా సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవాలని స్పష్టం చేశారు. శత్రువులకు కోలుకునే అవకాశం ఇవ్వని రీతిలో సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని, వారి వ్యూహాలను ముందుగానే అంచనా వేసి సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలను ప్రస్తావించిన ఆయన ఆధునిక యుద్ధాల్లో సంప్రదాయ ఆయుధాల కంటే డ్రోన్లు, అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థల ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోందని వివరించారు. ముఖ్యంగా ఆత్మాహుతి డ్రోన్లు, నిఘా డ్రోన్ల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. గూఢచార వ్యవస్థలను బలోపేతం చేయడంతోపాటు శత్రువుల వ్యూహాలను ముందుగానే ఛేదించే కార్యాచరణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. సైబర్ దాడులు, అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు వంటి అత్యాధునిక యుద్ధ విధానాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రక్షణ వ్యూహాలను రూపొందించాలని వైమానిక దళానికి దిశానిర్దేశం చేశారు. మారుతున్న భద్రతా పరిస్థితుల్లో సైనిక సన్నద్ధత, సాంకేతిక ఆధునికీకరణ, నిరంతర అప్రమత్తతే దేశ రక్షణకు కీలకమని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
