రైతులకు ఏఐ వ్యవసాయ సేవలు
- యూపీలో కొత్త రాజకీయ కూటమి.. - November 12, 2026
- దేశ విజయగాథలను చాటిచెప్పండి.. - November 12, 2026
- పేదల ఆత్మగౌరవమే ధ్యేయం! - November 12, 2026

హైదరాబాద్:
తెలంగాణ రైతాంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇకపై రైతులకు తెలుగులోనే కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వ్యవసాయ సలహాలు అందించేందుకు ‘భారత్ విస్తార్’ సేవలను రాష్ట్రంలో అమలు చేయనుంది. ఇందుకోసం వ్యవసాయ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (ఎన్ఐఎస్జీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ సాగు వ్యయాన్ని తగ్గించి, పంట దిగుబడులు పెంచడంతోపాటు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా రైతులకు ఆరు కీలక వ్యవసాయ సేవలు ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి రానున్నాయి. ‘భారతి’ పేరుతో రూపొందించిన ఏఐ వాయిస్ అసిస్టెంట్ రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. పంటల ఎంపిక, సాగు విధానాలు, వాతావరణ పరిస్థితులు, చీడపీడల నివారణ, నేల ఆరోగ్యం, ఎరువుల వినియోగంపై శాస్త్రీయ సూచనలు చేస్తుంది. అంతేకాకుండా మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల సమాచారం కూడా అందిస్తుంది. పంటలకు తెగుళ్లు సోకిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తుగానే సమస్యలను గుర్తించి రైతులను అప్రమత్తం చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకతగా నిలవనుంది. ఇప్పటికే 155261 హెల్ప్‌లైన్ ద్వారా వాయిస్ బాట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. మరో 15 నుంచి 21 రోజుల్లో తెలుగు వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 45 నుంచి 60 రోజుల్లో వాట్సాప్ చాట్‌బాట్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్లు లేని రైతులకు సైతం సాధారణ ఫోన్ ద్వారా వాయిస్ కాల్స్‌తో సేవలు అందించనున్నారు. నాలుగు దశల్లో భారత్ విస్తార్ సేవలను విస్తరించి, తెలంగాణ పంటలు, స్థానిక వాతావరణ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమాచారాన్ని అనుసంధానం చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్కేవీవై నిధులతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ విధానం క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలైతే రైతులకు సకాలంలో శాస్త్రీయ సలహాలు అందడంతోపాటు అనవసర పెట్టుబడులు తగ్గి వ్యవసాయ రంగంలో సాంకేతిక పరివర్తనకు మార్గం సుగమం కానుంది
