టిమ్స్‌ ఆసుపత్రులకు డెడ్‌లైన్‌

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూన్‌ 2వ తేదీ నాటికి అల్వాల్‌, ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రులు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్‌ విస్తరణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 2027 డిసెంబరు నాటికి నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. టిమ్స్‌ ఆసుపత్రులు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్‌ విస్తరణ, నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తయిన తర్వాత వైద్య సేవల ప్రారంభానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. భవనాల నిర్మాణంతోపాటు వైద్య పరికరాల కొనుగోలు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకాలను ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచినట్లు తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించాలన్నది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను ఏకీకృత విధానంలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా మూడు టిమ్స్‌ ఆసుపత్రుల మధ్య వైద్యులు, సిబ్బందిని బదిలీ చేసుకునే విధానం ఉండాలని సూచించారు. ఆసుపత్రుల నిర్వహణ, హౌస్‌కీపింగ్‌ పనులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో చేపట్టాలని తెలిపారు. టిమ్స్‌ పర్యవేక్షణకు గ్రూప్‌-1 అధికారులను నియమించడంతోపాటు నిర్వహణ, పారిశుద్ధ్య సిబ్బందిపై పర్యవేక్షణ కోసం విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామని వెల్లడించారు. దీంతో వైద్యులు పరిపాలనా వ్యవహారాలకు దూరంగా ఉండి పూర్తిస్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

నిమ్స్‌లో శస్త్రచికిత్సల కోసం రోగులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తున్న నేపథ్యంలో సనత్‌నగర్‌ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిమ్స్‌లో పడకలు అందుబాటులో లేకపోయినా, శస్త్రచికిత్సలకు ఆలస్యమైనా రోగులకు సనత్‌నగర్‌ టిమ్స్‌లో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, నిమ్స్‌, టిమ్స్‌ డైరెక్టర్లు నిరంతరం సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. టిమ్స్‌లో వైద్యుల నియామకాలు పూర్తయ్యే వరకు బయటి వైద్యులను నియమించుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో డయాలసిస్‌ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, నిర్మాణంలో ఉన్న మరో 79 కేంద్రాల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. టిమ్స్‌తోపాటు వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలల నిర్మాణాలు, పరికరాల కొనుగోలు ప్రక్రియలను కూడా వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత పర్యవేక్షణతో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్య పెరగడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఔట్‌పేషెంట్ల (ఓపీ) సంఖ్య 7 కోట్ల నుంచి 9 కోట్లకు పెరగగా, ఇన్‌పేషెంట్ల (ఐపీ) సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు చేరిందని వివరించారు. రాష్ట్ర బడ్జెట్‌లో గతంలో ఆరోగ్య రంగానికి సగటున 3.9 శాతం నిధులు కేటాయించగా, గత మూడేళ్లుగా సగటున 4.8 శాతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్లలో వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బంది కలిపి 13,401 నియామకాలు పూర్తి చేశామని, మరో 5,640 నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖకు అవసరమైన నిధులను ఎంత మొత్తమైనా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆసుపత్రుల నిర్మాణం, సిబ్బంది నియామకాలు, ఆధునిక వైద్య పరికరాల సమకూర్పు వంటి అంశాల్లో జాప్యానికి తావులేకుండా నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు తేల్చిచెప్పారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

You may also like...