యూపీలో కొత్త రాజకీయ కూటమి..
- వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఒకరు మృతి - November 12, 2026
- టిమ్స్ ఆసుపత్రులకు డెడ్‌లైన్ - November 12, 2026
- యూపీలో కొత్త రాజకీయ కూటమి.. - November 12, 2026

జ్ఞాన తెలంగాణ నేషనల్ బ్యూరో :
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2027 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని అధికార బీజేపీకి వ్యతిరేకంగా కొత్త రాజకీయ కూటమి ఆవిర్భవించింది. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ చేతులు కలిపి ‘సామాజిక పరివర్తన మోర్చా’ పేరుతో నూతన రాజకీయ వేదికను ప్రకటించారు. లక్నోలో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడగా, కూటమి తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్ పేరును ఒవైసీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఒవైసీ స్పష్టం చేశారు. వెనుకబడిన, దళిత, మైనారిటీ, అణగారిన వర్గాలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. విద్యావ్యవస్థలో అసమానతలు, యువతలో నిరుద్యోగం, రైతుల సమస్యలపై తమ పోరాటం కేంద్రీకృతమవుతుందని వెల్లడించారు. ఈ నెల 26న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మరోవైపు చంద్రశేఖర్ ఆజాద్ తమ కూటమిని మూడో ఫ్రంట్‌గా పిలవడాన్ని తప్పుబట్టారు. ఇది కేవలం ఎన్నికల పొత్తు కాదని, సామాజికంగా అణచివేతకు గురవుతున్న వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే వేదిక అని పేర్కొన్నారు. బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు కూడా తమకు మద్దతుగా రావచ్చని ఆహ్వానించారు. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, సీట్ల పంపకాలపై భాగస్వాముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సైతం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆశించిన స్థాయిలో కృషి చేయలేదని ఆరోపించారు. సామాజిక న్యాయం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను విస్మరించే పార్టీలకు తమ కూటమి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రకటించిన లక్ష్యాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతాయి? ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏ మేరకు సహకరిస్తాయి? ఓటర్ల మద్దతును ఎలా కూడగడతాయి? అన్నది కీలకంగా మారింది. ఎన్నికల సమయానికి రాజకీయ బలం, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల ఎంపికే ఈ కూటమి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మొత్తంగా ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ కలయిక ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసింది.
