పోలీసు కుటుంబాలకు నైపుణ్యాభివృద్ధి..

సైబరాబాద్,  పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమం, భవిష్యత్తు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సైబరాబాద్ పోలీస్ శాఖ ‘సంక్షేమ వారధి’ పేరుతో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది పిల్లలు, జీవిత భాగస్వాములకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సీసీటీవీ రిపేరింగ్, సోలార్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నీషియన్, 3డీ ప్రింటింగ్, ఈవీ టెక్నాలజీ, మొబైల్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మటాలజీ తదితర 17 విభాగాల్లో శిక్షణ అందించనున్నారు.

ఈ కోర్సుల ద్వారా ఉద్యోగాలు పొందడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను కూడా అందిపుచ్చుకునేలా శిక్షణ ఇవ్వనున్నారు. కోర్సుల వివరాలు, శిక్షణ విధానం, అర్హతలు తదితర అంశాలపై నవంబర్ 11న అవగాహన కార్యక్రమం నిర్వహించి, అనంతరం శిక్షణ తరగతులను ప్రారంభించనున్నారు.

పోలీసు సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారి కుటుంబాలకు నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ‘సంక్షేమ వారధి’ ఒక వినూత్న ముందడుగుగా నిలవనుంది.

You may also like...