కేబినెట్ ముందుకు కీలక నిర్ణయాలు..
- కేబినెట్ ముందుకు కీలక నిర్ణయాలు.. - October 1, 2026
- ఈశాన్యంలో రికార్డు కరువు - October 1, 2026
- నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ - October 1, 2026

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు కరువు భత్యాల (డీఏ)కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. దసరా పండుగకు ముందే డీఏలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. డీఏలతో ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారంపైనా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో పేద కుటుంబాలకు కుటుంబ యజమాని మరణించిన సందర్భంలో రూ.5 లక్షల ఆర్థిక రక్షణ కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం విధివిధానాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ పథకాన్ని నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పథకం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులు, అర్హతలు, అమలు విధానంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశముంది.
డిసెంబరులో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపైనా సమావేశంలో సమీక్ష జరగనుంది. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వివిధ శాఖలు చేపడుతున్న ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం దృష్టి సారించే అవకాశం ఉంది. మరోవైపు పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రతిపాదనపై కేశవరావు నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ పరిశీలించనుంది. ప్రభుత్వం ఇప్పటికే పాలిటెక్నిక్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
రెవెన్యూ శాఖకు సంబంధించిన 22-ఏ నిషేధిత భూముల జాబితా, యూఎల్సీ భూములు, ధరణి సంబంధిత అంశాలు కూడా మంత్రివర్గం ముందుకు రానున్నాయి. అదేవిధంగా కొత్త పెన్షన్లు, రాజీవ్ యువ వికాసం, హైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అంచనాల సవరణ తదితర అంశాలు కూడా కేబినెట్ చర్చల్లో ఉండనున్నాయి. కాళేశ్వరం ద్వారా సాగునీటి సరఫరాకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు, ఇతర నీటిపారుదల అంశాలపైనా మంత్రివర్గం సమాలోచనలు చేయనున్నట్లు సమాచారం.
