లంచం వలలో మొయినాబాద్ మున్సిపల్ అధికారులు
- కేబినెట్ ముందుకు కీలక నిర్ణయాలు.. - October 1, 2026
- ఈశాన్యంలో రికార్డు కరువు - October 1, 2026
- నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ - October 1, 2026

- రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు
- టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి అరెస్ట్
- సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్ కూడా పట్టుబాటు
- అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు డిమాండ్
- లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచన
జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్ రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి చేపట్టిన నిర్మాణాన్ని అక్రమ నిర్మాణంగా పరిగణించి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ సిటీ రేంజ్-2 బృందం పక్కా ప్రణాళికతో వల పన్ని సెప్టెంబర్ 30న ట్రాప్ నిర్వహించింది. టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి తరఫున సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్ బాధితుడి నుంచి రూ.75 వేల నగదు తీసుకుని ఆమెకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుదర్శన్ వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. ఇద్దరూ తమ అధికారిక విధులను దుర్వినియోగం చేసి అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ ఆరోపించింది. గుండు వాణి, సుదర్శన్‌లను నాంపల్లిలోని SPE, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ గోప్యంగా ఉంచింది. ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారి ఏదైనా ప్రభుత్వ పని కోసం లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. లంచం డిమాండ్లపై సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.
