అక్టోబర్‌ 4న తెలంగాణకు అమిత్‌షా

  • తూప్రాన్‌లో డెయిరీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో కార్యక్రమం
  • రైతుల సమావేశంలో ప్రసంగించే అవకాశం
  • కరీంనగర్‌లో ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ సిల్వర్‌ జూబ్లీ
  • సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం

జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యురో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అక్టోబర్‌ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేయనున్న డెయిరీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ ప్రాజెక్టును సబర్‌ డెయిరీతో అనుసంధానించినట్లు సమాచారం. తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్‌ పార్క్‌లో జరిగే కార్యక్రమం అనంతరం అమిత్‌షా కరీంనగర్‌కు వెళ్లి ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్నారు. అక్టోబర్‌ 3 రాత్రి హైదరాబాద్‌కు చేరుకుని బస చేయనున్న ఆయన, అక్టోబర్‌ 4 ఉదయం హెలికాప్టర్‌లో తూప్రాన్‌కు చేరుకునేలా షెడ్యూల్‌ రూపొందించినట్లు సమాచారం. తూప్రాన్‌ కార్యక్రమం అనంతరం కరీంనగర్‌ చేరుకుని మధ్యాహ్నం సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. అనంతరం బేగంపేటకు చేరుకుని సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం చేయనున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో తూప్రాన్‌, కరీంనగర్‌లో అధికారులు భద్రత, వేదిక, పార్కింగ్‌, రాకపోకల ఏర్పాట్లపై దృష్టి సారించారు. తూప్రాన్‌లో డెయిరీ ప్రాజెక్టు ప్రారంభం పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తిదారులకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉండగా, కరీంనగర్‌లో వైద్య విద్యాసంస్థ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.

You may also like...