జీఎస్టీ ఆదాయానికి ఏఐ అస్త్రం
- నేడు సాయంత్రం 5 గంటలకు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు - August 8, 2026
- వీడియోలతో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్ - August 7, 2026
- జీఎస్టీ ఆదాయానికి ఏఐ అస్త్రం - August 7, 2026

జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యురో:
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు పన్నుల లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పన్నుల వసూళ్లు, ఆదాయ వృద్ధి, సంస్కరణలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ఆదాయాన్ని పెంచడమే కాకుండా పారదర్శకమైన పన్ను వ్యవస్థను నిర్మించడంపై ముఖ్యమంత్రి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై విస్తృతంగా చర్చ జరిగింది. జీఎస్టీ అధికారులకు అత్యాధునిక ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. వ్యాపార లావాదేవీలు, పన్నుల చెల్లింపులు, లావాదేవీల ధోరణి, పన్ను ఎగవేత అవకాశాలు, రిస్క్ విశ్లేషణ వంటి అంశాలను ఏఐ ద్వారా వేగంగా గుర్తించే విధంగా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో మానవ పరిశీలనతో పాటు కృత్రిమ మేధస్సు సహకారం ఉంటే పన్ను వసూళ్లు మరింత సమర్థవంతంగా జరుగుతాయని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. అధికారులు అవసరమైన సమాచారాన్ని ఒకే వేదికపై పొందే విధంగా వ్యవస్థ రూపొందిస్తే నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందని అరవింద్ సుబ్రమణియన్ వివరించారు. సాంకేతికత ఆధారంగా పన్ను పరిపాలనను ఆధునికీకరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచవచ్చని ఆయన సూచించారు.

అయితే ఆదాయాన్ని పెంచే క్రమంలో వ్యాపార వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజాయితీగా వ్యాపారం చేసే వ్యాపారులకు సులభతర సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అదే సమయంలో పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ప్రతి రూపాయి పన్ను ప్రభుత్వానికి చేరేలా చర్యలు ఉండాలని, అదే సమయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా సంస్కరణలు అమలు చేయాలని సూచించారు. వ్యాపారాలకు అనవసర తనిఖీలు, ఇబ్బందులు కాకుండా డేటా ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించాలని పేర్కొన్నారు. సాంకేతికత ప్రజలకు భారంగా కాకుండా పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే సాధనంగా మారాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రానికి భారీగా నష్టం కలిగిస్తున్న పన్నుల లీకేజీలను పూర్తిగా అరికట్టేందుకు శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పన్ను ఎగవేతకు ఆస్కారం లేకుండా మున్సిపల్ శాఖ, రెరా, పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ, వాణిజ్య పన్నుల శాఖల మధ్య సమాచారాన్ని ఏఐ ద్వారా అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒక భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన దశ నుంచే అవసరమయ్యే నిర్మాణ సామగ్రి, వ్యయ అంచనాలు, చెల్లించాల్సిన పన్నుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే విధానాన్ని తీసుకురావాలని సూచించారు. నిర్మాణ అనుమతులు, సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రి వినియోగం, విద్యుత్ కనెక్షన్లు, రిజిస్ట్రేషన్ తదితర సమాచారాన్ని ఒకే వ్యవస్థలో సమీకరిస్తే పన్ను ఎగవేతకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. శాఖలు విడివిడిగా పనిచేసే పాత విధానానికి బదులుగా సమగ్ర సమాచార వ్యవస్థ ద్వారా పారదర్శక పరిపాలన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా మీసేవా, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సమగ్ర డేటా ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచడం వల్ల పరిపాలన మరింత వేగవంతం అవుతుందని, నిర్ణయాలు శాస్త్రీయంగా తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు నుంచి ఆదాయ వృద్ధి వరకు ప్రతి అంశంలో డేటా ఆధారిత పరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. భవిష్యత్తు పరిపాలన పూర్తిగా సాంకేతికత ఆధారంగా సాగాల్సిన అవసరం ఉందని, ఏఐ వినియోగంతో ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా మారడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని శాఖల వారీగా అమలు చేయాల్సిన సంస్కరణలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పారదర్శకత, సాంకేతికత, సమన్వయంతో కూడిన నూతన వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం ఈ సమావేశంలో ప్రధానాంశంగా నిలిచింది.
