హైకోర్టు ఆదేశాలు అమలులో జాప్యంకు కలెక్టర్పై చర్యలు

*రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు*

*పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నాలుగు వారాల పాటు శిక్ష నిలిపివేత*

 హైకోర్టు ఆదేశాలను అమలు చేయని వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో జరిగిన జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాలను అమలు చేయలేదంటూ కోర్టు ధిక్కరణకు సంబంధించిన వ్యవహారం న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.

అయితే, ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ జైలు శిక్ష అమలును నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. హైకోర్టు విధించిన శిక్ష, జరిమానాను సవాల్ చేస్తూ కలెక్టర్ నారాయణ రెడ్డి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై డివిజన్ బెంచ్‌లో విచారణ అనంతరం వెలువడే నిర్ణయం కీలకంగా మారనుంది.

You may also like...