దేశ విజయగాథలను చాటిచెప్పండి..


నేషనల్ బ్యూరో : దేశం వివిధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు చేరవేయడంలో మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ విజయగాథలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని సూచించారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పాత్రికేయుల కోసం నిర్వహించిన దీపావళి మిలన్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా గత 12 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ పేదరిక నిర్మూలనలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం గత 12 ఏళ్లలో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. గతంలో పేదరిక నిర్మూలన పేరుతో కేవలం నినాదాలకే పరిమితమైన పాలకులు, ఆచరణలో ప్రజల జీవితాలను మార్చలేకపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కార్యాచరణతో ముందుకు సాగిందని వివరించారు. అనంతరం మీడియాతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పత్రికా ప్రకటనల నుంచి నేటి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ వరకు మీడియా రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను దగ్గరగా పరిశీలించానన్నారు. 1990లో దేశవ్యాప్తంగా చేపట్టిన రెండు ప్రధాన యాత్రల బాధ్యతలను నిర్వహించినప్పుడు ఫ్యాక్స్‌ యంత్రం కోసం వెతుక్కుంటూ పత్రికా ప్రకటనలు పంపిన రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో దీపావళి మిలన్‌ కార్యక్రమాల్లో కుర్చీలు సర్దడం, అతిథులకు ఏర్పాట్లు చేయడం వంటి పనులు కూడా చేసేవాడినని తెలిపారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తన నియామకం గురించి రాజకీయ వర్గాలకంటే ముందే పాత్రికేయులకు తెలిసిన సందర్భాన్ని వివరించారు. మహిళా పాత్రికేయులు స్వీట్లు అడిగిన సంఘటనను ప్రస్తావిస్తూ మీడియాతో తన అనుబంధాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ అధిపతిగా 25 ఏళ్లు పూర్తయిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, దేశ యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న మాదకద్రవ్యాల దుర్వినియోగంపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలని మీడియాకు సూచించారు. మత్తుపదార్థాల వ్యసనం కుటుంబాలను విచ్ఛిన్నం చేయడంతో పాటు యువత జీవితాలను అంధకారంలోకి నెడుతోందని, ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. దేశంలో సమస్యలు, సంక్షోభాలపైనే కాకుండా అభివృద్ధి, విజయాలు, ప్రజల సాధనలపైనా సమాన ప్రాధాన్యంతో కథనాలు ప్రచురించాలని కోరారు. అయితే ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడమే కాకుండా ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రశ్నించడం, పాలకుల బాధ్యతను గుర్తుచేయడం కూడా మీడియా ప్రాథమిక కర్తవ్యమనే అభిప్రాయం పాత్రికేయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అభివృద్ధి గణాంకాల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను వెలికితీస్తూ ప్రజలకు సమగ్ర సమాచారాన్ని అందించడమే స్వతంత్ర జర్నలిజానికి అసలైన పరీక్షగా నిలుస్తోంది.

You may also like...