సింగరేణికి కొత్త ఊపిరి

  • మణుగూరు పీకేఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కింది
  • నెల రోజుల్లో రెండు చారిత్రక విజయాలు
  • 120 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు
  • 2 వేల మందికి ఉపాధికి భరోసా
  • కోయగూడెం-3, సత్తుపల్లి-3 తదుపరి లక్ష్యం

హైదరాబాద్/అమెరికా, ఆగస్టు 3: ప్రజా ప్రభుత్వ కృషితో సింగరేణి సంస్థకు మరో కీలక విజయం దక్కిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో మణుగూరు ఏరియాకు అత్యంత కీలకమైన పీకేఓసీ-2 డిప్‌సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణి దక్కించుకోవడం చారిత్రక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. సింగరేణి పరిరక్షణ, విస్తరణ, రాష్ట్ర ఇంధన భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కృషికి ఇది నిదర్శనమని అన్నారు.

తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణిని మరింత బలోపేతం చేసేందుకు కొత్త బొగ్గు బ్లాక్‌లను దక్కించుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో సింగరేణి ప్రయోజనాలను విస్మరించారని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు. ఈ సహకారంతోనే దాదాపు 12 సంవత్సరాల తర్వాత వేలం ద్వారా సింగరేణికి మరో బొగ్గు బ్లాక్ దక్కిందని వివరించారు.

గత నెలలో ఒడిశాలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి ప్రారంభం కావడం, తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజులు సాధించడం, ఇప్పుడు మణుగూరు పీకేఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను దక్కించుకోవడం ద్వారా నెల రోజుల వ్యవధిలోనే సింగరేణి రెండు చారిత్రక విజయాలను నమోదు చేసుకుందని భట్టి పేర్కొన్నారు. తాడిచర్ల-2 బ్లాక్‌లో 336 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, 45 సంవత్సరాల పాటు బొగ్గు వెలికితీసే అవకాశం ఉందన్నారు.

మణుగూరు పీకేఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌లో 120 మిలియన్ టన్నుల జీ-8 గ్రేడ్ నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ గని నుంచి ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 20 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. ఈ బొగ్గు తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉపయోగపడుతుందని, రాష్ట్ర ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.

మణుగూరు ఏరియాలో ఈ బ్లాక్ లభించడం వల్ల దాదాపు 2 వేల మంది కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి భద్రత కలుగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఊపునిస్తుందని, మణుగూరు ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. సింగరేణి భవిష్యత్తు, తెలంగాణ ఇంధన భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో కోయగూడెం-3, సత్తుపల్లి-3 వంటి కీలక బొగ్గు బ్లాక్‌లు ప్రైవేట్ సంస్థలకు వెళ్లిపోయాయని భట్టి విమర్శించారు. ప్రజా ప్రభుత్వం మాత్రం సింగరేణి ప్రయోజనాలనే కేంద్రబిందువుగా తీసుకుని ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోందని తెలిపారు. కోయగూడెం-3, సత్తుపల్లి-3 బొగ్గు బ్లాక్‌లను కూడా సింగరేణికి దక్కించుకోవడమే తదుపరి లక్ష్యమని పేర్కొంటూ, సింగరేణి మరింత విస్తరించేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

You may also like...