సాగునీటి ప్రాజెక్టులకు వేగం
- రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్ - August 3, 2026
- మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు - August 3, 2026
- సమన్వయంతోనే ప్రభుత్వ పథకాల సమర్థ అమలు: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు - August 3, 2026

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,ఆగస్టు 3: రాష్ట్ర సాగునీటి భవిష్యత్తును నిర్ణయించే నాలుగు కీలక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని పర్యావరణ అనుమతులను సాధ్యమైనంత వరకు ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకోసం దశలవారీ కార్యాచరణ రూపొందించి, నిర్దిష్ట గడువుల్లో ప్రతి ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా–బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయక్‌తో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ అనుమతులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తెలంగాణకు న్యాయపరమైన స్పష్టతను కల్పించిందన్నారు. ఈ తీర్పు వల్ల రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఏర్పడిందని తెలిపారు. గతంలో చట్టబద్ధంగా అనుమతులు పొందిన ప్రాజెక్టులకు రక్షణ కొనసాగుతుందని, ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలను కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేందుకు అవకాశం ఉందని చెప్పారు. గతంలో తిరస్కరణకు గురైన ప్రతిపాదనలను సాంకేతిక, విధానపరమైన లోపాలు సరిదిద్దిన తర్వాత అవసరమైతే తిరిగి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

దేశవ్యాప్తంగా పర్యావరణ అనుమతుల వ్యవస్థపై ప్రభావం చూపే ఈ తీర్పు వెనుక తెలంగాణ ప్రభుత్వం సాగించిన న్యాయపోరాటం కూడా కీలక పాత్ర పోషించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ తీర్పులోని న్యాయసూత్రాలను లోతుగా అధ్యయనం చేసి, రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టుకు అన్వయించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత చట్టబద్ధ సంస్థలతో సమన్వయం పెంచి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ సాగునీటి ప్రయోజనాల పరిరక్షణలో అంతర్రాష్ట్ర విభాగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సాంకేతిక నిపుణులు, పర్యావరణ నిపుణులు, న్యాయ నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), సుప్రీంకోర్టు, ఇతర న్యాయస్థానాల ముందు తెలంగాణ వాదనను శాస్త్రీయ ఆధారాలతో సమర్థవంతంగా వినిపించేలా సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి చరిత్ర ఒకే దస్త్రంలో అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. అసలు పర్యావరణ అనుమతులు, రీడిజైన్‌లు, విస్తరణలు, భూసేకరణ, అటవీ అనుమతులు, పెండింగ్ కేసులు, న్యాయపరమైన అంశాలు, జరిమానాలు, దాఖలు చేసిన దరఖాస్తులు వంటి అన్ని వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రతి పత్రాన్ని సాంకేతికంగా, చట్టపరంగా లోపరహితంగా సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
పర్యావరణ అనుమతుల సాధన కోసం దశలవారీ కార్యాచరణను కూడా మంత్రి ప్రకటించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, అందుబాటులో ఉన్న అన్ని రికార్డులను ఏడు రోజుల్లో సమీకరించాలని ఆదేశించారు. నవీకరించిన పర్యావరణ అధ్యయనాలు, భూ రికార్డులు, న్యాయపరమైన పత్రాలు, నిబంధనల అమలు నివేదికలు వంటి అన్ని అవసరమైన దస్త్రాలను 30 రోజుల్లో సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ప్రధాన పరిపాలనా ప్రక్రియలు, దరఖాస్తుల తయారీ, పరిశీలన, సమర్పణ వంటి అంశాలను 60 రోజుల్లో పూర్తి చేసి, చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తైన తర్వాత సాధ్యమైనంతవరకు ఆరు నెలల్లో పర్యావరణ అనుమతులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి వారం నివేదిక సమర్పించాలని, ప్రతి నెలా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. నిర్ణీత గడువుల అమలులో అలసత్వం లేదా నిర్లక్ష్యానికి ఏమాత్రం తావులేదని హెచ్చరించారు. పర్యావరణ ప్రభావ అధ్యయనాలు, పునరావాస–పునర్నిర్మాణ ప్రణాళికలు, అటవీ అనుమతులు, భూసేకరణ రికార్డులు, న్యాయస్థానాలకు సమర్పించాల్సిన కౌంటర్ అఫిడవిట్ల తయారీలో చిన్నపాటి లోపం జరిగినా మొత్తం ప్రక్రియ ఆలస్యమవుతుందని స్పష్టం చేశారు.
రైతులు, నిర్వాసితుల హక్కులను పరిరక్షించడం కూడా ప్రభుత్వ ప్రధాన బాధ్యతేనని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేపట్టే ముందు పర్యావరణ, అటవీ, భూసేకరణ, పునరావాసం, పరిహారం వంటి అంశాలను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం అనే మూడు అంశాల మధ్య సమతుల్యత ఉండేలా ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.
గౌరవెల్లి ప్రాజెక్టును ప్రత్యేకంగా సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంప్‌హౌస్‌ను పూర్తిస్థాయిలో సర్వసన్నద్ధంగా ఉంచాలని ఇంజినీర్లకు ఆదేశించారు. పంపులను ప్రారంభించే ముందు అవసరమైన తనిఖీలు, పరీక్షలు, మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. ఎడమ, కుడి కాలువల వ్యవస్థను పూర్తిగా పరిశీలించి, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న అవరోధాలను తొలగించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కాలువ తవ్వకాలు, గట్ల తొలగింపు, రహదారి క్రాసింగ్‌లు, వంతెనలు, గ్రామాల అనుసంధానం వంటి అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
సీతారామ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అధ్యయనాలు, ఇతర పత్రాలను వెంటనే నవీకరించాలని మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించేలా టెండర్లు, ఇంజినీరింగ్ ప్రణాళికలు, అంచనాలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే స్థాయి అత్యవసరతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాలతో నిరంతర సమన్వయం కొనసాగించాలని సూచించారు.
ఎన్‌జీటీ, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో రాష్ట్ర న్యాయ సలహాదారులు, అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో సమన్వయం పెంచాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి కేసుకు అవసరమైన పర్యావరణ అధ్యయనాలు, సాంకేతిక నివేదికలు, కౌంటర్ అఫిడవిట్లు ముందుగానే సిద్ధం చేయాలని, విచారణ సమయంలో హడావుడిగా పత్రాలు సేకరించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
సమావేశంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై కూడా విస్తృతంగా చర్చించారు. తెలంగాణలోని భూములు, గ్రామాలు, ప్రజా మౌలిక వసతులు, ఇతర ఆస్తులపై పడే ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయి సమాచారం, సాంకేతిక అధ్యయనాలు, సమగ్ర ఆర్థిక అంచనాల ఆధారంగా తెలంగాణ వాదనను కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముందు సమర్థవంతంగా వినిపించాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బ్యాక్‌వాటర్ ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయాలని తెలిపారు. ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావంతో నష్టపోయే భూములు, మౌలిక వసతులు, ఇతర ఆస్తులకు సంబంధించిన పరిహారం బాధ్యత సంబంధిత కేంద్ర సంస్థలదేనని పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయం పెంచి తెలంగాణకు రావాల్సిన పరిహార దావాలను సమగ్ర ఆధారాలతో సిద్ధం చేసి అధికారికంగా సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు.
సమావేశంలో ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్‌బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్ (అడ్మిన్) పి. శ్రీనివాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) ఆర్. మధుసూదన్‌రావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కల్పించిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు వేగంగా పర్యావరణ అనుమతులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు
