ఓటరు వివరాల్లో లోపాలు సరిచేయాలి: సి. సుదర్శన్ రెడ్డి

  • ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్రస్థాయి సమీక్ష
  • డిజిటైజేషన్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం
  • ASDD కేసులపై ప్రత్యేక దృష్టి
  • బీఎల్‌వోలు క్షేత్రస్థాయి ధృవీకరణ బలోపేతం
  • దోషరహిత ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫొటోలు లేకపోవడం, జన్మతేదీల్లో వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలు వంటి అంశాలను పూర్తిగా సరిచేసి, ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.

సోమవారం అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు, డిజిటైజేషన్ పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై జిల్లా అధికారులతో చర్చించారు.

ప్రత్యేకంగా గైర్హాజరైన (Absent), నివాసం మార్చుకున్న (Shifted), మరణించిన (Dead), నకిలీ (Duplicate) ఓటర్లకు సంబంధించిన ASDD కేసులను పూర్తిస్థాయిలో పునఃపరిశీలించాలని ఆదేశించారు. ఏ ఒక్క అర్హుడైన ఓటరు పొరపాటున జాబితా నుంచి తొలగించబడకుండా, అనర్హులు జాబితాలో కొనసాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే No Mapping కేసులను కూడా సమగ్రంగా పరిశీలించి తగిన సవరణలు చేయాలని సూచించారు.

ఓటరు జాబితాలో లోపాలు గుర్తించిన వెంటనే రోల్‌బ్యాక్ సదుపాయాన్ని వినియోగించి రికార్డులను తిరిగి పరిశీలించి సరిచేయాలని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROలు) క్షేత్రస్థాయిలో మరింత జాగ్రత్తగా ధృవీకరణ చేపట్టాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

బూత్ లెవల్ అధికారులతో నిర్వహించిన సమావేశాల మినిట్స్‌ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల (BLAలు) సంతకాలతో సిద్ధం చేసి అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే 85 సంవత్సరాలు పైబడిన వృద్ధ ఓటర్ల వివరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి, వారికి సంబంధించిన వ్యత్యాసాలను త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు అన్ని పట్టణ జిల్లాల జిల్లా ఎన్నికల అధికారుల పనితీరును సమీక్షించిన సి. సుదర్శన్ రెడ్డి, పెండింగ్‌లో ఉన్న No Mapping, ASDD, సేకరించని ఎన్యూమరేషన్ ఫారాలు, ఇతర అసంగతతలను త్వరితగతిన పరిష్కరించి దోషరహిత ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

You may also like...