బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు భద్రతపై అవగాహన

దుగ్గెపల్లి:-దుగ్గెపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేకల వెంకట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వీబీజీ రాంజీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలు, కూలీ పనులు చేసుకునే కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, పిల్లల భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మేకల వెంకట్, గ్రామ కార్యదర్శి నిరంజన్, ప్రధానోపాధ్యాయులు దశరథ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిగత భద్రతపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాలకు వెళ్లే సమయంలో రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, జీబ్రా క్రాసింగ్‌ను ఉపయోగించాలని, పాఠశాల బస్సులు, వ్యాన్ల విషయంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు.అదేవిధంగా చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలని, ఎవరైనా అసౌకర్యంగా ప్రవర్తించినా, తాకినా భయపడకుండా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. ఆపద సమయంలో చైల్డ్‌లైన్ 1098 సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.విద్యార్థుల భద్రత, సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలలు సురక్షిత వాతావరణంలో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జనార్దన్, వార్డు సభ్యులు, ఉన్నత పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...