ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆక్రమణలు తొలగించి పార్కలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలతో పాటు చెరువును హైడ్రా కాపాడుతున్నారు. వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ గ్రామంలోని సర్వే నంబర్లు 94, 95లో ఉన్న 3,400 చదరపు గజాల ప్రజావసరాల స్థలాన్ని హైడ్రా అధికారులు పరిరక్షించారు. ఈ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ అందిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కు కోసం 1,122 చదరపు గజాలు, పాఠశాల కోసం 1,018 చదరపు గజాలు, కమ్యూనిటీ హాలు కోసం 742 చదరపు గజాలు, ఆలయ హాలు కోసం 518 చదరపు గజాల స్థలాలను లే ఔట్ వేసినప్పుడు కేటాయించినట్టు గుర్తించారు. మొత్తం 3,400 చదరపు గజాల స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి.. బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.