పేదల ఆత్మగౌరవమే ధ్యేయం!
- ప్రపంచ కార్పొరేట్లో భారతీయుల హవా - November 12, 2026
- వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఒకరు మృతి - November 12, 2026
- టిమ్స్ ఆసుపత్రులకు డెడ్‌లైన్ - November 12, 2026

రాజేంద్రనగర్, నవంబర్ 12:
పేదల సొంతింటి కలను సాకారం చేసి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రాజేంద్రనగర్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా, కేటాయింపుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది ప్రజలు, లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఎకరా రూ.250 కోట్ల నుంచి రూ.270 కోట్ల వరకు విలువ చేసే ఖరీదైన భూముల్లో సైతం పేదల కోసం ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 23 నియోజకవర్గాల్లో చేపట్టిన టవర్ల నిర్మాణాలను వచ్చే దీపావళి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. ఇళ్ల కేటాయింపులో రాజకీయ, కుల, మత వివక్షకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, చిన్నారి చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించడం ఇందుకు నిదర్శనమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 2,21,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. మొదటి విడతలో ఇళ్లు రాని వారు ఆందోళన చెందవద్దని, తదుపరి విడతల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డ్వాక్రా మహిళలకు రూ.73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు, 4.50 లక్షల మందికి కొత్త ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. ఈ నెల 19 నుంచి మహిళలకు చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పేదల సంక్షేమం, ఆత్మగౌరవానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి విడతలవారీగా ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్, పీడీ హౌసింగ్ చంప్లా నాయక్, తహశీల్దార్లు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ పారిజాతం, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు
