సర్పంచుల మాటకు విలువ ఇవ్వాలి.. అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి!

తాడ్వాయి: గ్రామాల అభివృద్ధి పనుల్లో సర్పంచులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించాలని ఎంపీడీవో భరత్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి రఘునందన్ అధ్యక్షతన మండల స్థాయి సర్వసభ్య సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. ప్రజాసేవే లక్ష్యంగా బాధ్యతలు చేపట్టిన తమను అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రతిపాదించిన పనులను పెండింగ్‌లో ఉంచుతున్నారని, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు.
సర్పంచుల అభిప్రాయాలపై స్పందించిన ఎంపీడీవో భరత్ కుమార్.. గ్రామానికి సర్పంచే ప్రథమ పౌరుడని, గ్రామస్థాయిలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో సంబంధిత సర్పంచుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
అనంతరం వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి హామీ తదితర శాఖల పనితీరును సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే సమావేశం నాటికి పురోగతి చూపాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి రఘునందన్, ఎంపీడీవో భరత్ కుమార్, తహసీల్దార్ శ్వేత, ఏపీఓ అశోక్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

You may also like...