వ్యవసాయ వర్సిటీలో ఉద్రిక్తత.. బాధిత ప్రొఫెసర్‌కు అండగా తెలంగాణ రక్షణ సేన

400764.png

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాధిత మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) శ్రేణులు నిరసన చేపట్టాయి. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ ఆదేశాల మేరకు, రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు పడాల మనోజ గౌడ్, రాజేంద్రనగర్ ఇన్‌చార్జ్ సర్వేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మహిళా నాయకురాళ్లు వర్సిటీకి వెళ్లి బాధిత ప్రొఫెసర్‌కు సంఘీభావం ప్రకటించారు.

అయితే, సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మహిళా నాయకురాళ్లను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ మహిళా విభాగ జనరల్ సెక్రటరీ గీత గౌడ్ గాయపడటాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా పడాల మనోజ గౌడ్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఘటనపై ఉన్నత స్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవం, భద్రత విషయంలో రాజీపడేది లేదని, బాధిత ప్రొఫెసర్‌కు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా మహిళా అధ్యక్షురాళ్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

You may also like...