బ్యాంక్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా

జ్ఞాన తెలంగాణ, సెప్టెంబర్ 28: సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వగా, ఆదివారం UFBU ప్రతినిధులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చలు జరిగాయి. చర్చలు సానుకూలంగా సాగడంతో ప్రస్తుతానికి సమ్మెను వాయిదా వేస్తున్నట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లలో ఒకటైన శనివారాల సెలవు అంశంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలన్న డిమాండ్‌పై కమిటీ పరిశీలన చేపట్టనుంది. కమిటీ చర్చలు, నిర్ణయాల ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని UFBU నాయకులు వెల్లడించారు. దీంతో సెప్టెంబర్ 28–30 మధ్య బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఏర్పడే అంతరాయం ప్రస్తుతానికి తప్పినట్లైంది. అయితే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలో కమిటీ తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. ప్రభుత్వం, IBAతో జరిగే తదుపరి చర్చలను ఉద్యోగ సంఘాలు నిశితంగా పరిశీలించనున్నాయి.

You may also like...