దళిత మహిళా సర్పంచ్ కు అవమానం – ఎమ్మెల్యే పై ఆరోపణలు

1001207094.jpg

వంగూరు: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజాల గ్రామ సర్పంచ్ జిలకర కాశమ్మ ఎమ్మెల్యే వంశీకృష్ణపై తీవ్ర ఆరోపణలు చేశారు. సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామ అభివృద్ధి కోసం కొత్త మోటార్లు, వీధి దీపాలు తదితర పనులు చేయించానని, ఇందుకోసం తన బంగారు పుస్తెలతాడు, ఉంగరాలను తాకట్టు పెట్టి సొంత డబ్బులు ఖర్చు చేశానని తెలిపారు.గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలు, ఎంబీ రికార్డులు తీసుకుని తాను ఖర్చు చేసిన నగదును తిరిగి పొందేందుకు ప్రయత్నించగా గ్రామ కార్యదర్శి తీర్మానాలు ఇవ్వడం లేదని ఆమె పేర్కొన్నారు.ఎమ్మెల్యే ఇవ్వొద్దని చెప్పారని కార్యదర్శి తనకు తెలిపినట్లు ఆరోపించారు.ఈ నెల 22న వంగూరు మండల జనరల్ బాడీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణను ఈ విషయంపై ప్రశ్నించగా, తానే తీర్మానాలను నిలిపివేశానని చెప్పినట్లు సర్పంచ్ తెలిపారు. తన మాట వినితేనే తీర్మానాలు ఇస్తానని ఎమ్మెల్యే చెప్పారని, సభలో తనను దూషించి అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. తనను సస్పెండ్, డిస్మిస్ చేయిస్తానని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.అలాగే జాజాల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లు, లారీలకు తాము అడ్డుగా ఉన్నామనే కారణంతో తనను, గ్రామస్తులను బెదిరిస్తున్నారని కాశమ్మ ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.తనకు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మీడియా ప్రతినిధులను, మండల ప్రజలను ఆమె కోరారు.

You may also like...