ఐలయ్యా.. నీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
- ఐలయ్యా.. నీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? - September 22, 2026
- భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు - September 22, 2026
- మిట్టపల్లి మురళయ్య కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - September 22, 2026
ఐలయ్యా.. నీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
బీర్ల ఐలయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్..
ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
జ్ఞాన తెలంగాణ, నకిరేకల్, సెప్టెంబర్ 22: రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా ఉన్న బీర్ల ఐలయ్య వందల కోట్లకు ఎలా ఎదిగారో ప్రజలందరికీ తెలుసని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నకిరేకల్ పట్టణంలోని సువర్ణ గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధిని అడ్డుపెట్టుకుని పరిసర ప్రాంతాల్లో భారీగా వెంచర్లు చేసి సామాన్యులను మోసం చేశారని ఆరోపించారు. మాసాయిపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 726లో సుమారు 1,200 ఎకరాలు, రాజాపేట మండలంలోని సర్వే నంబర్ 32లో సుమారు 200 ఎకరాల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండానే ప్లాట్లు విక్రయించారని విమర్శించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ప్రస్తుతం వాటిని గుర్తించలేని పరిస్థితి ఉందన్నారు. తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి పరిధిలో భూ వివాదంలో జోక్యం చేసుకుని సుమారు 100 ఎకరాల భూమిని తన అనుచరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. చెరువుల్లో మట్టి, ఇసుక దందాల ద్వారా భారీగా సంపాదించారని విమర్శించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలోనే భారీగా ఆస్తులు, వాహనాలు ఎలా సమకూరాయో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడ్డారన్న ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరపాలని కోరారు. బీర్ల ఐలయ్య తన ఆస్తులు, వ్యాపార వ్యవహారాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. హరీశ్‌రావుపై బీర్ల ఐలయ్య చేస్తున్న విమర్శలను లింగయ్య తప్పుబట్టారు. గతంలో ఇరిగేషన్, వైద్యారోగ్య శాఖల మంత్రిగా హరీశ్‌రావు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో చెక్‌డ్యామ్‌లు, వంతెనలు, వైద్య సదుపాయాలు, యాదగిరిగుట్ట ప్రభుత్వ మెడికల్ కాలేజీ వంటి పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని లింగయ్య అన్నారు. కృష్ణా నదిలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తెలంగాణ రైతులకు సాగునీరు అందడం లేదని విమర్శించారు. రుణమాఫీ, రైతుబంధు, ఎరువులు, పంటల బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకే ప్రస్తుత కాంగ్రెస్ నేతలు రిబ్బన్లు కట్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తన స్థాయిని గుర్తుంచుకుని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై విమర్శలు చేయాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయంగా ఎదిగిన ఎమ్మెల్యే వేముల వీరేశం ఇప్పుడు కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై ముట్టడి కార్యక్రమాలకు పిలుపునివ్వడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నేతల ప్రైవేటు ఫామ్‌హౌస్‌లపై పదేపదే ఆందోళనలు చేస్తే భవిష్యత్తులో బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే తరహాలో స్పందిస్తాయని హెచ్చరించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన సమాధానం చెబుతామన్నారు. సమావేశంలో కొప్పుల ప్రదీప్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, రాచకొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
