బియ్యం ధరలకు కళ్లెం!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: రాష్ట్రంలో బియ్యం ధరల పేరుతో సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న బియ్యం ధరల భారాన్ని తగ్గించడంతో పాటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి విక్రయించకుండా మూడు రకాల బియ్యానికి గరిష్ఠ రిటైల్ ధరలను (MRP) నిర్ణయించింది. బీపీటీ, కేఎన్‌ఎం రకాల బియ్యం కిలో ధర రూ.66గా, ఆర్‌ఎన్‌ఆర్‌, తెలంగాణ సోనా ధర రూ.74గా, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్‌ రకాల ధర రూ.79గా ఖరారు చేసింది. నిర్ణయించిన ధరలను మించి విక్రయిస్తే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.

మిల్లర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు తప్పనిసరిగా బియ్యం ప్యాకెట్లపై గరిష్ఠ ధరను ముద్రించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 26 కిలోల బస్తాలపై నిర్ణీత ఎంఆర్‌పీ స్పష్టంగా కనిపించేలా ముద్రించాల్సి ఉంటుంది. బస్తాల బరువులో మోసాలు, ధరల విషయంలో అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

అక్టోబర్‌ 29 నుంచి నవంబర్‌ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు 1,141 తనిఖీలు చేపట్టి 55 కేసులు నమోదు చేశారు. వీటిలో 35 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు లీగల్‌ మెట్రాలజీ శాఖ అధికారులు 1,545 తనిఖీలు నిర్వహించి 280 కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి.

ముఖ్యంగా 26 కిలోలుగా లేబుల్‌ ముద్రించి వాస్తవానికి 25 కిలోల బియ్యమే విక్రయించడం, అసలు ధరపై అధిక ధరల స్టిక్కర్లు అతికించడం, పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. జీఎస్టీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపైనా చర్యలకు సిద్ధమయ్యారు.

నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వ్యాపారులపై పీడీ యాక్ట్‌తో పాటు ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు హెచ్చరించారు. ప్రజలను తూకం, ధరల పేరుతో మోసం చేసే అక్రమ వ్యాపారులకు ఇకపై ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను మరింత ముమ్మరం చేయనుండటంతో బియ్యం వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. నిర్ణయించిన ధరలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలైతే సామాన్య వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది.

You may also like...