పోయిన ఫోన్లకు భరోసా.. CEIRతో రికవరీ!

జ్ఞాన తెలంగాణ, సిద్దిపేట, నవంబర్ 6: పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను తిరిగి పొందడంలో సిద్దిపేట పోలీసులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ సహాయంతో గత నెల రోజుల్లో సుమారు రూ.10 లక్షల విలువైన 56 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌, ఐపీఎస్‌ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విలువైన మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకుని ఆందోళన చెందుతున్న బాధితులకు వాటిని తిరిగి అందించడం ద్వారా పోలీసు శాఖ ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచింది. మొబైల్‌ ఫోన్‌ పోయిన వెంటనే ఆందోళన చెందకుండా ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసి, CEIR పోర్టల్‌లో ఫోన్‌ IMEI నంబర్‌తో బ్లాక్‌ చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఫోన్‌ వినియోగాన్ని నిరోధించడంతో పాటు, తిరిగి గుర్తించే అవకాశం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ బాధితులకు న్యాయం చేస్తున్న సిద్దిపేట పోలీసుల చర్యలు అభినందనీయం.

You may also like...