కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి

1001193213.jpg

కల్వకుర్తి, సెప్టెంబర్ 19: వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి పట్టణ కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామానికి చెందిన జంపుల అరవింద్ (26) బీజేవైఎం మండల జనరల్ సెక్రెటరీ వినాయక మండపం వద్ద అలంకరణ కోసం ఏర్పాటు చేసిన కాషాయ తోరణాలపై వర్షం కారణంగా పడిన విద్యుత్ తీగలను తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు.అరవింద్‌ను కాపాడేందుకు అతడి స్నేహితుడు లక్ష్మయ్య ప్రయత్నించగా అతడూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన మరో యువకుడు లక్ష్మయ్యను విద్యుత్ ప్రవాహం నుంచి కాపాడాడు.తీవ్రంగా గాయపడిన అరవింద్‌ను చికిత్స నిమిత్తం కల్వకుర్తిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అరవింద్ కుటుంబంలో ఒక్కగానొక్క కుమారుడు కావడంతో అతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తర్నికల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

You may also like...