యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం


జ్ఞాన తెలంగాణ, స్టేట్ ప్రతినిధి: తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్ది దేశీయ, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు అనుసంధానం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు), గనులు మరియు భూగర్భశాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. విద్యార్థులు శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా శిక్షణ నుంచి ఉపాధి వరకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగిలో నూతన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV), రోబోటిక్స్, డ్రోన్స్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 120 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాత తరహా కోర్సులకు బదులుగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక శిక్షణ అందించి యువతను ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేయడం ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
వ్యవసాయ రంగంలో కూడా సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారుతున్న నేపథ్యంలో రుద్రంగి ఏటీసీలో వ్యవసాయ ఆధారిత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కోర్సులను ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీని మంత్రి ఆదేశించారు. ఇందుకు ఐక్రిసాట్ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక కోర్సు రూపొందించాలని సూచించారు. గ్రామీణ యువతకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగంలోనూ ఉపాధి అవకాశాలను విస్తరించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో చదువుతున్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును మధ్యలోనే మానేయకుండా ప్రభుత్వం నెలకు రూ.2,000 స్టైపెండ్ అందిస్తోందని మంత్రి తెలిపారు. శిక్షణ ఇవ్వడమే ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి విద్యార్థికి తగిన ఉద్యోగం లభించే వరకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. యువతకు నాణ్యమైన శిక్షణతో పాటు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.


తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నర్సులు, ఎలక్ట్రిషియన్లు, కేర్‌గివర్లు, ఇతర సాంకేతిక నిపుణులకు భారీ డిమాండ్ ఉందన్నారు. రుద్రంగి ప్రాంతానికి చెందిన 100 మంది అర్హులైన యువతను గుర్తిస్తే ప్రభుత్వం అక్కడికే జర్మన్ భాషా శిక్షకుడిని పంపించి శిక్షణ అందిస్తుందని, అనంతరం టామ్‌కామ్ ద్వారా విదేశీ ఉద్యోగాల నియామక బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. ఇప్పటికే మండమర్రిలో 100 మంది యువతకు జర్మన్ భాషా శిక్షణ కొనసాగుతోందని, భాషా నైపుణ్యంతో పాటు సాంకేతిక అర్హతలు కలిగిన వారికి జర్మనీ, జపాన్‌లో నెలకు రూ.2 లక్షలకు పైగా వేతనాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. త్వరలోనే టామ్‌కామ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక శిక్షణా సంస్థలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి ఆరోపించారు. మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలు, పరిశ్రమలకు అవసరమైన శిక్షణపై సరైన దృష్టి పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసి యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించేలా చర్యలు చేపట్టిందన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కూడా మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో రూపుదిద్దుకున్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు తక్కువ వ్యయంతో, గురుత్వాకర్షణ ఆధారిత సాగునీటి విధానంతో రూపొందించబడిందని గుర్తుచేశారు. అనంతరం ప్రాజెక్టు రూపురేఖలు మార్చి కాళేశ్వరంగా మార్చడంతో నిర్మాణ వ్యయం పెరగడమే కాకుండా విద్యుత్ వినియోగంపై వేల కోట్ల రూపాయల భారం రాష్ట్రంపై పడిందని ఆరోపించారు. భారీ మోటార్లతో నీటిని ఎత్తిపోయాల్సిన పరిస్థితి వల్ల ప్రతి ఏడాది ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని పేర్కొన్నారు. బ్యారేజీల్లో సమస్యలు బయటపడిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు.


వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభివృద్ధి పట్ల చూపుతున్న కట్టుబాటును మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతి సమావేశానికి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలతో ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. వేములవాడలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపడుతున్నామని, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో తెలంగాణ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ నమూనాకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు తెలిపిందని, పీఎం సేతు పథకంలో తెలంగాణకు మూడు క్లస్టర్లు లభించడం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సామర్థ్యానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

You may also like...