పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు..!
- పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు..! - July 30, 2026
- ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం - July 29, 2026
- శంకర్పల్లిలో ‘మా విలేజ్ రెస్టారెంట్’ ప్రారంభం - July 29, 2026

- మృత్యువుతో పోరాడి ఓడిపోయిన ఉద్యమ యోధుడు..
- బీఆర్ఎస్ను శోకసంద్రంలో ముంచిన పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి
హైదరాబాద్, జూలై 31 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా చెమటోడ్చిన ఓ యోధుడు… ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించిన ఓ నాయకుడు… మృత్యువుతో ఐదు రోజులపాటు ప్రాణాంతక పోరాటం చేసి చివరకు కాలగర్భంలో కలిసిపోయారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో నర్సంపేట నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాజకీయాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
ఈ నెల 26న హనుమకొండలోని తన నివాసంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన సుదర్శన్ రెడ్డిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా యశోద ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్మో సహా అత్యాధునిక వైద్య చికిత్సలు అందించారు. వైద్యులు రేయింబవళ్లు శ్రమించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి వైద్యులను ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. కేటీఆర్, హరీశ్ రావు ప్రత్యేకంగా చికిత్సను పర్యవేక్షించారు. అయినప్పటికీ మృత్యువు ముందు అన్ని ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మోసుకెళ్లిన మరో నాయకుడు శాశ్వత నిద్రలోకి జారిపోయారు.

1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అసాధారణ గుర్తింపు సంపాదించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ వెంట అడుగులు వేస్తూ వేలాది మంది ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అహర్నిశలు శ్రమించి జడ్పీటీసీగా, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్గా, అనంతరం నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు.

2023 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ప్రజలను మాత్రం వదల్లేదు. పదవి కోల్పోయినా ప్రజా సమస్యలపై తన గళాన్ని ఎప్పుడూ మూయలేదు. అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు.
మరణం ఒక మనిషిని మాత్రమే తీసుకుపోగలదు… కానీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన నాయకుడి జ్ఞాపకాలను ఎన్నటికీ చెరపలేడు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం ఒక కుటుంబానికే కాదు, ఆయనను నమ్ముకున్న వేలాది మంది కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని విశ్వసించిన ప్రతి ఒక్కరికీ తీరని వేదన. ఆయన లేని లోటు నింపలేనిది. ఆయన ఆశయాలు, ప్రజాసేవ పట్ల అంకితభావం, ఉద్యమస్ఫూర్తి తెలంగాణ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
భౌతికంగా దూరమైనా… ప్రజల గుండెల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి చిరస్థాయిగా జీవిస్తూనే ఉంటారు.
