గణపతి పూజలో ఘర్షణ.. పూజారి మృతి
- హయత్‌నగర్ సమీపంలో ఘోర ప్రమాదం - September 15, 2026
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన - September 15, 2026
- తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం భేటీ - September 15, 2026

వినాయక చవితి వేడుకల వేళ నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో గణపతి పూజ నిర్వహిస్తున్న ఉప్పల దత్తు ప్రసాద్ అనే పూజారి ఆకస్మికంగా కుప్పకూలి మృతిచెందారు. పూజ ఎక్కడ ముందుగా నిర్వహించాలనే అంశంపై స్థానికులతో వాగ్వాదం జరిగిన కొద్దిసేపటికే ఆయన ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.నాగార్జునసాగర్‌కు చెందిన దత్తు ప్రసాద్ చింతలపాలెంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన గుండాల రవి, పున్నయ్య అక్కడికి వచ్చి తమ మండపంలో ముందుగా పూజ చేయాలని పట్టుబట్టడంతో పూజారితో వాగ్వాదం జరిగింది. పరిస్థితి తీవ్రతరం కాకుండా గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని దత్తు ప్రసాద్‌ను గుండాల రవి మండపం వద్దకు తీసుకెళ్లారు.అక్కడ పూజ పూర్తి చేసిన కొద్దిసేపటికే దత్తు ప్రసాద్ ఒక్కసారిగా స్పృహతప్పి నేలకూలిపోయారు. వెంటనే ఆయనను సాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పండుగ రోజున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాగ్వాదానికి, పూజారి మృతికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. పూజారి మృతికి కచ్చితమైన కారణాలు దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
