ర్యాగింగ్ ఘటనకు బాధ్యత వహిస్తూ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలి – విద్యార్థి సంఘాల డిమాండ్

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వెలుగుచూసిన ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ర్యాగింగ్‌కు పాల్పడిన 14 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం మాత్రమే సరిపోదని, ఘటనకు బాధ్యత వహిస్తూ కళాశాల ప్రిన్సిపాల్, డిప్యూటీ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్, డిప్యూటీ వార్డెన్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపాల్ చాంబర్‌లో సుమారు గంటపాటు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కళాశాలలో గతంలోనూ ర్యాగింగ్ ఘటనలు జరిగినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యాయని ఆరోపించారు. ప్రిన్సిపాల్ విద్యార్థులకు అందుబాటులో ఉండకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే విద్యార్థుల్లో భయం లేకుండా పోయిందన్నారు. బాధ్యులైన వార్డెన్, డిప్యూటీ వార్డెన్లను వదిలేసి కేవలం విద్యార్థులపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల్లోనూ ర్యాగింగ్ ఘటనలు జరిగాయని, ఇక్కడ జరిగితే తప్పేంటన్న ధోరణిలో ప్రిన్సిపాల్ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.గత నెల 28న జరిగిన ర్యాగింగ్ ఘటనపై విద్యార్థులు ఎన్‌హెచ్‌ఎంకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టి 14 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వాలియా తెలిపారు. హాస్టల్‌లో ఉండే నలుగురు విద్యార్థులకు ఆరు నెలలు, డే స్కాలర్లుగా ఉన్న పది మందికి నాలుగు నెలల సస్పెన్షన్ విధించినట్లు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రిన్సిపాల్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టడంతో దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్ జోక్యం చేసుకుని మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ రాష్ట్ర కో-కన్వీనర్ జీవియం విఠల్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్ కుమార్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సాయినాథ్, ఏఐఎస్ఏ జిల్లా ఇన్‌చార్జి పెరుమాండ్ల బుల్లెట్, బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు రవితేజ, విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్, జీవీఎస్ జిల్లా అధ్యక్షులు వినోద్, ఏఐఎస్ఏ పట్టణ అధ్యక్షులు రోహిత్, గడం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...