ఐక్యత చాటిన తెలంగాణ.. ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు
- రౌండ్-16లోకి దూసుకెళ్లిన సింధు
- September 26, 2026 - రాత్రి అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా? - September 26, 2026
- కాచిగూడలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి - September 26, 2026

- రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు
- పోర్టల్లో 1.24 లక్షల విగ్రహాల నమోదు
- ఇప్పటికే 88 వేల విగ్రహాల నిమజ్జనం
- హైదరాబాద్లో 25 వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు
- టీజీఎస్పీ, ఆర్ఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆక్టోపస్ బలగాల మోహరింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. తెలంగాణ ప్రజానీకం ఐక్యత, సంయమనం చాటుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ఇప్పటివరకు పూర్తయిన నిమజ్జనాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ పోర్టల్లో 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని, గతేడాది ఈ సంఖ్య సుమారు 1.15 లక్షలు ఉండగా ఈసారి మరింత పెరిగిందని తెలిపారు. అపార్ట్మెంట్లు, ఇళ్లు, వ్యక్తిగత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను కలుపుకుంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.5 నుంచి 4 లక్షల వరకు విగ్రహాలు ఉండే అవకాశం ఉందని డీజీపీ వివరించారు. శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని, మిగిలిన విగ్రహాలు శనివారం ఉదయానికి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం కావడంతో మతపరమైన అంశాలను గౌరవిస్తూ హైదరాబాద్లో శోభాయాత్రలు మధ్యాహ్నం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, దీంతో కొన్ని ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ కూడా ఆలస్యంగా సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్లో భారీ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి తరలిరావడంతో ట్రాఫిక్ నియంత్రణకు కొంత సమయం పడుతోందన్నారు. నగరంలో గత పది రోజులుగా 25 వేల మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ తదితర అధికారులతో కలిసి ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని పరిశీలించినట్లు తెలిపారు. రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల పరిధి విస్తరించడంతో ఆయా మార్గాల్లో విగ్రహాల తరలింపునకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నిమజ్జనోత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా టీజీఎస్పీ, ఆర్ఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించినట్లు డీజీపీ తెలిపారు. డీజీపీ రిజర్వ్ నుంచి ఐదు కంపెనీలను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో భారీ సంఖ్యలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రేన్లు, ఇతర రక్షణ, అత్యవసర సేవలను కూడా అందుబాటులో ఉంచినట్లు డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు
