ఎన్‌ఆర్‌ఐ సీట్లకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు లేవు

జ్ఞాన తెలంగాణ, సెంట్రల్ డెస్క్ : ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్యంతో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోని ప్రవాస భారతీయుల కోటా సీట్లను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సి ఉంటుందని ధార్వాడ్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ సీట్లకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి సామాజిక రిజర్వేషన్లు వర్తించవని పేర్కొంది. నీట్‌–యూజీ కౌన్సెలింగ్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ 18 ఏళ్ల అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. జస్టిస్‌ ఎం. నాగప్రసన్న, జస్టిస్‌ హేమ కులకర్ణిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను సాధారణ రిజర్వేషన్‌ విధానంతో కలపడం సాధ్యం కాదని, వాటి స్వభావమే ప్రత్యేకంగా ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అదనపు నిధుల సమీకరణ వంటి అవసరాలను తీర్చడంలో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అందువల్ల ఈ సీట్లను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సిన అవసరం ఉందని తెలిపింది. నీట్‌–యూజీ ప్రవేశాల సమయంలో ఎన్‌ఆర్‌ఐ కోటాకు సంబంధించిన నిబంధనలు, అర్హతలు, సీట్ల కేటాయింపు విధానం ప్రత్యేకంగా ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు వర్తింపజేయాలన్న పిటిషనర్‌ వాదనను ధర్మాసనం అంగీకరించలేదు. దీంతో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద వైద్య, వృత్తి విద్యా సీట్ల కేటాయింపుపై కర్ణాటక హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

You may also like...