తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అత్యున్నత పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో 1992 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన సంజయ్ జాజుకు అత్యున్నత పరిపాలనా బాధ్యతలను అప్పగించింది. కేంద్ర ప్రభుత్వంలో దాదాపు పన్నెండేళ్లపాటు వివిధ వ్యూహాత్మక, విధానపరమైన కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (DoPT) మూడు రోజుల క్రితమే రిలీవ్ చేయడం గమనార్హం. పరిపాలనా సామర్థ్యం, విధాన రూపకల్పనలో ప్రావీణ్యం, కేంద్ర-రాష్ట్ర సమన్వయంలో విశేష అనుభవం కలిగిన అధికారిగా సంజయ్ జాజుకు గుర్తింపు ఉంది. 2014 అక్టోబర్ నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగిన ఆయన నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్‌గా, అనంతరం భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా, సమాచార–ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ఇటీవల ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్, సహాయ పునరావాస శాఖ కమిషనర్, నీటిపారుదల ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖ కమిషనర్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ వంటి కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహించి తన పరిపాలనా ముద్ర వేశారు. నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాను కొనసాగిస్తూ, సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగాల అదనపు బాధ్యతలను అప్పగించింది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సీఈఓగా, రాష్ట్ర పెట్టుబడుల వేగవంతమైన అనుమతుల కోసం ఏర్పాటైన స్పీడ్ విభాగం అదనపు బాధ్యతలను కూడా ఆయనకే కేటాయించింది. దీంతో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, డిజిటల్ పరిపాలన, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అత్యంత ప్రాధాన్య రంగాలన్నీ ఒకే అధికారి పర్యవేక్షణలోకి రావడం విశేషంగా మారింది. ఇదే సమయంలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో కొనసాగుతూ ప్రభుత్వానికి విధానపరమైన సలహాలు అందించనున్నారు. మరోవైపు నూతన సీఎస్ నియామకంతో పాటు పరిపాలనా యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఏకకాలంలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ విస్తృతస్థాయి పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ బదిలీల్లో భాగంగా సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా నియమించగా, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌ను నియమించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌కు టెక్స్టైల్స్ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించగా, శైలజా రామయ్యర్‌ను అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అహ్మద్ నదీమ్‌ను సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జ, రోడ్లు–భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కే. గంగాధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మహమ్మద్ అలీ ముష్రాఫ్ ఫరూఖీని టీజీఆర్ఈడీసీవో వైస్ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించగా, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా విద్యాసాగర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా టి. వెంకన్న, హ్యాండ్లూమ్స్–టెక్స్టైల్స్–హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక కార్యదర్శిగా పి. కాత్యాయనిదేవి, మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శిగా ఎం. రఘునందన్ రావును ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్)గా వినయ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ పరిపాలనా పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ విధానాల అమలు వేగవంతం చేయడం, పారిశ్రామికీకరణకు ఊతమివ్వడం, పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజా పరిపాలనలో కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సంజయ్ జాజు నియామకం రాష్ట్ర పరిపాలనలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది
