అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించి త్వరలోనే వారికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని మంత్రి విమర్శించారు. గతంలో ప్రజలకు నాణ్యత లేని దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసేవారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి సన్న బియ్యాన్ని సేకరించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తోందని తెలిపారు.

దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. పేద కుటుంబాలకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ఆహార భద్రతకు సంబంధించిన పత్రం మాత్రమే కాదని, అది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కల్పించే గౌరవం, గుర్తింపు, భరోసాకు ప్రతీక అని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పరిశీలన అనంతరం కార్డులు జారీ చేస్తామని నేతలు స్పష్టం చేశారు.

You may also like...