దీపావళి వేళ కత్తులతో బీభత్సం!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: దీపావళి పర్వదినం వేళ హైదరాబాద్‌లోని గాంధీభవన్ పటేల్‌నగర్‌లో పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆమన్, వాయిద్ వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగడంతో పలువురు గాయపడ్డారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తి మరో వర్గానికి చెందిన వ్యక్తిపై టపాసులు వేయడంతో వివాదం ప్రారంభమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న బేగంబజార్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జి చేపట్టారు. దీంతో ఘర్షణకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పండుగ పూట శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ కత్తులతో వీరంగం సృష్టించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు గల పూర్తి కారణాలు, దాడిలో పాల్గొన్న వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

You may also like...