పెళ్లి పేరుతో రూ.5 కోట్ల మోసం!
- దళితుల ఆత్మగౌరవంపై దాడిని సహించం! - November 15, 2026
- మహిళా సాధికారతే లక్ష్యం! - November 15, 2026
- విద్యుత్ విమానయానంలో చైనా చారిత్రక ముందడుగు! - November 15, 2026

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వ్యాపార లావాదేవీల పేరుతో కోట్ల రూపాయలు మోసం చేయడమే కాకుండా, మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ వ్యాపారి మనీశ్ భాటిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన మహిళా వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మనీశ్ భాటితో పాటు పలువురిపై దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల కథనం ప్రకారం.. దిగుమతి వస్తువుల వ్యాపారం చేసే బాధితురాలికి 2024 జులైలో మనీశ్ భాటితో పరిచయం ఏర్పడింది. తొలుత పిస్తా, లవంగాల సరఫరా కోసం సరుకులు తీసుకుని సకాలంలో చెల్లింపులు చేయడంతో నమ్మకం కలిగించాడు. అనంతరం చెల్లింపులు నిలిపివేసి, తన సోదరుడు పవన్ భాటితో పాటు మహ్మద్ రషీద్, జీషాన్ అహ్మద్, నదీమ్ జుమానీ, ఇర్ఫాన్ భాడా పేర్లతోనూ సరుకులు తీసుకుని బకాయిలు పెట్టినట్లు బాధితురాలు ఆరోపించారు.

డబ్బులు అడిగిన ప్రతిసారీ మనీశ్ పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ బాధితురాలికి దగ్గరయ్యాడని, వీడియో కాల్స్ సమయంలో ఆమెకు తెలియకుండా ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు రికార్డు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2025 ఆగస్టు 5న హైదరాబాద్లోని ఓ హోటల్లో, సెప్టెంబర్ 9, 11 తేదీల్లో ఇతర హోటళ్లలో మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ప్రైవేట్ చిత్రాలను వ్యాపారుల వాట్సాప్ గ్రూపుల్లో పెడతానని బెదిరించినట్లు తెలిపారు.
నిందితులు తనకు మొత్తం రూ.5,09,81,914 బకాయి పడ్డారని బాధితురాలు వెల్లడించారు. ముంబై మహిమ్ పోలీస్స్టేషన్లో తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. నవంబర్ 13న కేసు పంజాగుట్ట పోలీసులకు బదిలీ కావడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
