నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ

హైదరాబాద్‌లో నేడు రాజకీయ, కార్మిక వర్గాల దృష్టిని ఆకర్షించే కార్యక్రమం జరగనుంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల ర్యాలీకి ప్రాధాన్యత ఏర్పడింది. సామాజిక భద్రత, కార్మిక హక్కులు, సంక్షేమ చర్యల అమలును డిమాండ్‌ చేస్తూ తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై కార్మికులకు సంఘీభావం ప్రకటించాలని యూనియన్‌ ప్రతినిధి షేక్‌ సలావుద్దీన్‌ రాహుల్‌ గాంధీని ఆహ్వానించారు. శిల్పకళా వేదిక నుంచి హెచ్‌ఐసీసీ, హైటెక్స్‌ ప్రాంతం వరకు ర్యాలీ కొనసాగనుంది. 2023లో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా గిగ్‌ కార్మికుల సమస్యలపై రాహుల్‌ గాంధీ స్పందించి మద్దతు తెలిపిన విషయాన్ని యూనియన్‌ గుర్తుచేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యాక్ట్‌–2026ను సమర్థంగా అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. కార్మికులందరికీ నమోదు, సామాజిక భద్రతా ప్రయోజనాలు, ప్రత్యేక సంక్షేమ బోర్డు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అందుబాటులోకి రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. రవాణా, ఫుడ్‌ డెలివరీ, ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో పనిచేస్తున్న కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

You may also like...