మైక్రోసాఫ్ట్‌ సేవల్లో ప్రపంచవ్యాప్త అంతరాయం

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఔట్‌లుక్‌ ఈమెయిల్‌ సేవలు, టీమ్స్‌ యాప్‌పై ప్రభావం పడటంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈమెయిళ్లు పంపడం, స్వీకరించడం, ఇన్‌బాక్స్‌ తెరవడం సాధ్యం కాకపోవడంతో కార్యాలయ కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు, ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్లకు ఆటంకం ఏర్పడింది. ఔటేజ్‌ ట్రాకర్‌ డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం ఒక్కసారిగా సుమారు 1.30 లక్షల మంది ఔట్‌లుక్‌ వినియోగదారులు సమస్యలను నివేదించారు. టీమ్స్‌, కో-పైలట్‌, మైక్రోసాఫ్ట్‌ 365లోని ఇతర సేవల్లోనూ అంతరాయాలు నమోదయ్యాయి. ఈ పరిణామంపై స్పందించిన మైక్రోసాఫ్ట్‌ తొలుత తన సాంకేతిక మౌలిక సదుపాయాలపై అసాధారణ లోడ్‌ పెరగడమే కారణమని భావించింది. అనంతరం ఆటోమేటెడ్‌ తనిఖీల సమయంలో కొన్ని సర్వర్లు విఫలమై, అందుబాటులో లేకుండా పోవడంతో కనెక్టివిటీ సమస్యలు తలెత్తినట్లు గుర్తించింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయని, సమస్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఫిక్స్‌ను పరీక్షిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. ఉత్తర అమెరికాలో టీమ్స్‌ సేవలకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించినప్పటికీ, కొంతమంది వినియోగదారులకు కనెక్టివిటీ ఇబ్బందులు కొనసాగినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్‌ ఆధారిత డిజిటల్‌ సేవలపై ఆధారపడుతున్న సంస్థలు, ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

You may also like...