హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలిగా, బహుజన ఆత్మగౌరవ ప్రతీకగా ఐలమ్మ పోషించిన పాత్రను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ఐలమ్మ ధిక్కార స్వరంగా నిలిచారని, తెలంగాణ తెగువకు ఆమె నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం సామాజిక చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిందని తెలిపారు. రైతులు, సబ్బండ కులాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే ఐలమ్మకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలోనూ ఐలమ్మ పోరాట స్ఫూర్తి అంతర్లీనంగా ఉందని, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఐలమ్మ త్యాగాలు, పోరాట వారసత్వాన్ని భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ తన ప్రకటనలో పేర్కొన్నారు