భూ రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మక మార్పులు

  • ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌తో అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్
  • అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై సమగ్ర విధానానికి ప్రభుత్వం కసరత్తు
  • రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ నంబర్
  • ధరణి అక్రమాలపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు
  • రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.18 వేల కోట్లకు చేరే అవకాశం: మంత్రి పొంగులేటి

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి:

రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా, అవినీతికి తావులేకుండా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ, మండల తహసీల్దార్లు వేర్వేరుగా వినియోగిస్తున్న వెబ్ పోర్టళ్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ పోర్టల్ అమల్లోకి వస్తే భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెరగడమే కాకుండా ప్రభుత్వ భూములు, నిషేధిత భూములు, అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇప్పటి వరకు వివిధ శాఖల పరిధిలో విడివిడిగా సాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్రతి లావాదేవీపై ప్రభుత్వానికి ప్రత్యక్ష పర్యవేక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ఏ కార్యాలయంలో రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఎంత ఆదాయం వచ్చింది, ఏ రకమైన భూముల లావాదేవీలు జరిగాయి వంటి వివరాలు డ్యాష్‌బోర్డ్ ద్వారా తక్షణమే తెలుసుకునే సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో ప్రత్యేక కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నాలా భూములు, అసైన్డ్ భూములు, నిషేధిత భూములు, ప్రభుత్వ భూములు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అవుతున్న ఘటనలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయని మంత్రి తెలిపారు. కొత్త ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు ఒకే వ్యవస్థలో పనిచేయాల్సి ఉండటంతో అక్రమ రిజిస్ట్రేషన్లు వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మరింత బలమైన వ్యవస్థ ఏర్పడుతుందని వివరించారు.

అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందిస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 85 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, పట్టణాలు, గ్రామాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్లు నిర్మించబడిన అసైన్డ్ భూములకు మార్కెట్ విలువలో సగం ధర నిర్ణయించి క్రమబద్ధీకరించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్న వారికి క్రమబద్ధీకరణ ద్వారా శాశ్వత హక్కులు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

అస్సైన్డ్ భూములను తిరిగి పూర్వ యజమానులకు అప్పగించే ఆలోచనే లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్న వారికే శాశ్వత హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ధరణి పోర్టల్ అమలులో జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారణ చేపట్టిందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణిని అడ్డుగా చేసుకుని భారీ స్థాయిలో భూ బదిలీలు, అక్రమ మ్యుటేషన్లు, ప్రభుత్వ భూముల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి లావాదేవీని ఆధారాలతో పరిశీలిస్తున్నామని, తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. నిషేధిత జాబితాలో భూములు ఎప్పుడు, ఎవరి హయాంలో చేరాయి, తర్వాత ఎందుకు తొలగించబడ్డాయి అనే అంశాలపై కూడా సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ధరణి పోర్టల్‌లో ఉన్న జాబితానే సమర్పించామని, ప్రభుత్వం కొత్తగా ఒక్క గుంట భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 276 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని వెల్లడించారు. ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ తరహాలో ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయించనున్నట్లు చెప్పారు. పాత సర్వే నంబర్లతో సంబంధం లేకుండా ప్రస్తుతం భూమిని కాస్తు చేస్తున్న లేదా పొజిషన్‌లో ఉన్న వ్యక్తుల ఆధారంగా సర్వే నిర్వహించి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తామని వివరించారు. ఇప్పటివరకు రెండు శాతం మాత్రమే అభ్యంతరాలు రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో నిర్వహించిన పైలెట్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయని మంత్రి తెలిపారు. రికార్డుల ప్రకారం 8,600 ఎకరాలు ఉన్నట్లు కనిపించినా, వాస్తవ సర్వేలో కేవలం 7,000 ఎకరాలే ఉన్నట్లు తేలిందన్నారు. ఆ ప్రకారంగానే కొత్త పాస్ పుస్తకాలు జారీ చేశామని వివరించారు. భూమి ఒకచోట, సర్వే నంబర్ మరోచోట ఉన్నా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాస్తవ స్థితిని బట్టి హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

ఇందిరమ్మ టవర్లపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కంటే అధిక నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్‌తో పాటు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు కేవలం ధ్రువపత్రాలు మాత్రమే ఇచ్చారని, రిజిస్ట్రేషన్ చేయలేదని విమర్శించారు. కొల్లూరులో నిర్మించిన ఇళ్లలో వర్షపు నీరు కారుతున్నా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరమ్మతులు కూడా ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు.

భూముల మార్కెట్ విలువల సవరణ తర్వాత రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం ఉండగా, గత ఏడాది అది రూ.15 వేల కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లకు చేరుకునే అవకాశముందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య కూడా భారీగా పెరగడం ప్రభుత్వ సంస్కరణల ఫలితమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

You may also like...